టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది? ఈ ప్రకటనలతో జాగ్రత్త: సజ్జనార్
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు చేస్తోన్న మోసపూరిత ప్రకటనలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. కేవలం డబ్బు కోసం కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యుల్ని తప్పుదోవపట్టిస్తున్నారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది? అని ముందే చెబుతామంటూ అమాయకుల్ని తమ ఛానెల్స్‌లో సబ్‌స్క్రైబ్ చేయించుకొని నిలువునా ముంచే బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అలాంటి నకిలీ ప్రిడిక్షన్ ఛానళ్లలో చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని, కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని ఈ సందర్భంగా సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. (Cyber Crime)
ఈ తరహా ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైం విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో 494 పెయిడ్ ప్రకటనలు, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ని బ్లాక్ చేయించినట్లు వెల్లడించారు. ఈ నిఘా నిరంతరం కొనసాగుతుందని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత యాడ్స్ మీ దృష్టికి వచ్చినా, లేదా మీరు మోసపోయినా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చన్నారు.