ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్ క్లారిటీ
మార్చి 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.
అమరావతి, మార్చి 26: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడిందని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(Speaker Ayanna Patrudu) వెల్లడించారు. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం వెలగపూడిలోని సచివాలయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మార్చి 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుందని చెప్పారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటి వరకు చట్టపరమైన స్పష్టత లేదని పేర్కొన్నారు.
ఈ లోటును భర్తీ చేసేందుకే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. విజయవాడ - అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి.. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని స్పీకర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఆమోదించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ఈ బిల్లు పార్లమెంట్‌లో పాస్ కావాల్సి ఉందన్నారు.
ఏప్రిల్ 4 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయని.. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ చేసే ఈ తీర్మానాన్ని వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టం చేయించేలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ తెలిపారు. ఈ చట్టం పూర్తి అయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందన్నారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో ఈ ఆరో సెషన్ జరుగుతుందని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివరించారు.