ప్రభుత్వ ఉద్యోగిగా మారిన రింకు సింగ్..
టీమిండియా పవర్ హిట్టర్, టీ20 ప్రపంచ కప్ 2026 విజేత రింకు సింగ్‌కు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. అతడిని రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా యోగి సర్కార్ నియమించింది.
స్పోర్ట్ డెస్క్: టీమిండియా పవర్ హిట్టర్, టీ20 ప్రపంచ కప్ 2026 విజేత రింకు సింగ్‌కు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. అతడిని రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా యోగి సర్కార్ నియమించింది. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) లఖ్‌నవూలోని లోక్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నియామ పత్రాన్ని రింకుకు సీఎం యోగి ఆదిత్య నాథ్ అందజేశారు. పొట్టి ప్రపంచం కప్ సమయంలోనే రింకు తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.
అంతటి విషాదంలో ఉండి కూడా తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే తిరిగి జట్టుతో చేరి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. రింకు టీ20 ప్రపంచ కప్ 2026లో మొత్తం 5 ఇన్నింగ్స్‌లో 24 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అన్ని మ్యాచ్‌లలో అతడు ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 బంతుల్లోనే 11 పరుగులు చేశాడు.ప్రపంచ కప్ 2026లో అతడి అంకితభావానికి గుర్తింపుగా యోగి ప్రభుత్వం ఈ ఉద్యోగంతో సత్కరించింది. రింకు సింగ్ పొందిన పోస్ట్ గ్రూప్-ఏ కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ. 70,000 వరకు చేతికి అందుతుంది.
ఇక రింకు సింగ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మరో ఐదుగురు అథ్లెట్లకు కూడా యూపీ ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించింది. రాజ్‌కుమార్ పాల్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్), అజిత్ సింగ్, సిమ్రాన్‌లను కూడా గ్రూప్-1లో వివిధ పోస్టుల్లో యూపీ ప్రభుత్వం నియమించింది. 2024-25 సంవత్సరానికి గాను తొమ్మిది మంది క్రీడాకారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాలైన లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులను అందజేశారు. వీరికి రూ. 3.11 లక్షల నగదు బహుమతితో పాటు కాంస్య విగ్రహాన్ని బహూకరించారు.