RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
సైబర్ నేరగాళ్లు జనసేన నేత, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును టార్గెట్ చేశారు. ఆయనకు వచ్చిన లింక్ క్లిక్ చేయగా అకౌంట్ నుంచి రూ.12 లక్షలు మాయమయ్యాయి.
Polavaram News | పోలవరం: సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం వదలడం లేదు. తాజాగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ మాయగాళ్ల వలలో చిక్కుకుని భారీగా నష్టపోయారు. ఆర్టీఏ (RTA) చలానా పేరుతో ఆయన మొబైల్‌కు వచ్చిన ఒక నకిలీ మెసేజ్‌ను నిజమని నమ్మి, అందులోని లింక్‌ను క్లిక్ చేయడమే ఆయన చేసిన తప్పిదం అయింది. అంతే ఆ లింక్ ద్వారా ఒక ప్రమాదకరమైన మాల్వేర్ యాప్ ఆయన ఫోన్లోకి చేరింది. ఫలితంగా జంగారెడ్డిగూడెంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతా నుండి ఏకంగా రూ. 12 లక్షలు నిమిషాల వ్యవధిలోనే మాయమయ్యాయి.
నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో షాక్‌కు గురైన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెంటనే అప్రమత్తమై జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల ఐపీ అడ్రస్ ట్రాకింగ్, యాప్ డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో సామాన్యుల పరిస్థితి ఏంటని పెద్ద చర్చకు దారితీసింది. సైబర్ నేరగాళ్లు ఎంతటి చాకచక్యంగా వ్యవహరిస్తున్నారో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.