షిప్లపై టోల్ ఫీజుకు ఇరాన్ యోచన!... జలసంధిలో ఇంటర్నెట్ కేబుల్స్ నూ కట్ చేయొచ్చన్న ఆందోళనలు
టెహ్రాన్: ప్రపంచ దేశాలకు ఆయిల్ రవాణా చేసేందుకు అత్యంత కీలక సముద్ర మార్గమైన హార్మూజ్ జలసంధి వద్ద నౌకలపై టోల్ ఫీజులు వసూలు చేసే అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తున్నది. ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఒక ఇరానియన్ ఎంపీ వెల్లడించారు. ప్రపంచ ఆయిల్, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో సుమారు 20 శాతం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది.
షిప్పింగ్, ఇంధన రవాణా, ఆహార సరఫరా కోసం ఈ మార్గాన్ని వినియోగించే దేశాలపై పన్నులు, టోల్‌లు విధించేలా ఇరాన్‌కు ప్రణాళిక ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి. కాగా, హార్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఎనర్జీ మార్గం. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, కువైట్, ఇరాన్ వంటి దేశాలు ఈ మార్గంపైనే ఆధారపడుతున్నాయి. ఈ మార్గం ద్వారా వెళ్లే ఇంధనంలో 80 శాతం ఆసియా దేశాలకు చేరుతుంది.
హార్మూజ్ జలసంధిపై టోల్ విధించే ఇరాన్ నిర్ణయం అమల్లోకి వస్తే, ప్రపంచ చమురు ధరలు, సరఫరా వ్యవస్థపై భారీ ప్రభావం పడనుంది. హార్మూజ్, ఎర్రసముద్రం గుండా వేసిన 20 అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ ను కట్ చేసే అంశాన్నీ ఇరాన్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇరాన్ ఇప్పటికే హార్మూజ్ జలసంధిని దిగ్బంధించి, ప్రపంచానికి ఇంధన సరఫరాను నిలిపివేసింది. ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మాండెబ్ మార్గంపై కూడా ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశం ప్రపంచ దేశాల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది.