రష్యా కీలక నిర్ణయం: చైనాకు వెళ్లాల్సిన 7 క్రూడ్ షిప్స్ మధ్యలోనే ఇండియాకు యూటర్న్
ప్రపంచ ఇంధన మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైనా తీరానికి వెళ్లాల్సిన రష్యా క్రూడ్ ఆయిల్ షిప్స్ ఒక్కసారిగా దారి మళ్లించి భారత్ వైపు పరుగులు తీస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో ప్రయాణిస్తున్న 7 భారీ రష్యన్ చమురు ట్యాంకర్లు యూ-టర్న్ తీసుకుని భారత నౌకాశ్రయాల వైపు రావడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరా నిలిచిపోయి ఇబ్బందుల్లో ఉన్న భారత్‌కు.. రష్యా ఇప్పుడు ఒక ఆపద్బాంధవుడిలా మారింది.
'ఆక్వా టైటాన్' అనే భారీ నౌక జనవరి చివరలో రష్యాలోని బాల్టిక్ సముద్ర తీరం నుంచి ముడి చమురుతో బయలుదేరింది. మొదట ఇది చైనాలోని రిజావో ఓడరేవుకు వెళ్లాల్సి ఉంది. అయితే మార్చి మధ్యలో ఆగ్నేయ ఆసియా జలాల్లో ఉండగా.. ఈ నౌక అకస్మాత్తుగా తన దిశను మార్చుకుంది. అమెరికా నుండి భారత్‌కు రష్యన్ చమురు కొనుగోళ్లపై తాత్కాలిక సడలింపులు లభించిన కొద్ది రోజుల్లోనే ఈ మార్పు జరగడం గమనార్హం. ప్రస్తుతం ఈ నౌక మార్చి 21న మంగళూరు తీరానికి చేరుకోనుంది. కేవలం ఈ ఒక్క నౌకనే కాకుండా.. కనీసం ఏడు ట్యాంకర్లు చైనాకు వెళ్లాల్సిన తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని భారత్ వైపు వస్తున్నట్లు వోర్టెక్సా లిమిటెడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
భారతదేశం తన ఇంధన భద్రతను కాపాడుకోవడంలో రష్యా పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ లోటును పూడ్చుకోవడానికి భారతీయ రిఫైనరీలు కేవలం ఒకే వారంలో ఏకంగా 30 మిలియన్ బారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేశాయి. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడంలో భారత్ ఇప్పుడు దూకుడు పెంచింది. భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా మళ్లీ రష్యన్ క్రూడ్ వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో రష్యన్ క్రూడ్ ధరలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.
మరోవైపు నల్ల సముద్రం నుంచి కజక్ చమురును మోసుకెళ్తున్న జౌజౌ ఎన్ అనే భారీ నౌక కూడా చైనాకు వెళ్లాల్సి ఉండగా.. మార్చి మొదట్లోనే దారి మళ్లించి భారత్‌లోని సిక్కా ఓడరేవు వైపు వస్తోంది. ఇది మార్చి 25న భారత్‌కు చేరుకోనుంది. భారత్‌లోని దాదాపు అన్ని ప్రధాన రిఫైనరీలు ఇప్పుడు రష్యా నుంచి క్రూడ్ కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నాయి. చమురు సంక్షోభం తలెత్తకుండా రష్యా అందిస్తున్న ఈ సహకారం భారత్‌కు పెద్ద ఊరటనిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నా.. రష్యా-భారత్ మధ్య ఉన్న ఈ చమురు బంధం దేశీయ ఇంధన ధరలు స్థిరంగా ఉండటానికి, సామాన్యుడిపై భారం పడకుండా ఉండటానికి సహాయపడుతోంది.