ఆస్కార్ నివాళుల జాబితాలో కోట శ్రీనివాసరావు.. ధర్మేంద్ర
ఇంటర్నెట్ డెస్క్: అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకొని.. గతేడాదిలో తుదిశ్వాస విడిచిన నటీనటులకు ఆస్కార్ నివాళులర్పించింది. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘In Memoriam’ సెగ్మెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా సినీరంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకున్నారు (Oscars). ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) వంటి దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచింది.
ఆస్కార్ వేడుక ప్రారంభంలో గతేడాది మరణించిన హాలీవుడ్ ప్రముఖులకు నివాళులర్పిస్తూ వీడియోను ప్రదర్శించారు. వారిని స్మరించుకుంటూ వారితో ఉన్న జ్ఞాపకాల గురించి కొందరు వేదికపై మాట్లాడారు. అయితే, ఆ వీడియోలో ధర్మేంద్రను (Dharmendra) చూపించకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తంచేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెట్టారు. సమయాభావం వల్ల వీడియోలో కొందరినే చూపారని.. ఆ తర్వాత అందరి పేర్లను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారని హాలీవుడ్ మీడియా పేర్కొంది.
89 ఏళ్ల వయసులో గతేడాది నవంబర్ 24న ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఇక 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన కోట శ్రీనివాసరావు గతేడాది జులై 13న మరణించిన విషయం తెలిసిందే.