హర్మూజ్‌ను దాటవేసి.. రెడ్‌సీ మీదుగా సౌదీ చమురు ఎగుమతి
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్ యుద్ధంతో దశాబ్దాలుగా అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హర్మూజ్ ఎఫెక్ట్‌తో గల్ఫ్ దేశాలు కొత్త మార్గాలపై దృష్టిపెడుతున్నాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా (Saudi Arabia) ఎర్ర సముద్రం మీదుగా చమురు ఎగుమతులను పెంచింది.
ప్రస్తుత అంతరాయాల వేళ.. సౌదీ అరేబియా ‘పెట్రోలైన్’ (ఈస్ట్-వెస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ నెట్‌వర్క్) ఇంధన రవాణాలో కీలకంగా మారిపోయింది. పర్షియన్ గల్ఫ్‌లోని ఉత్పత్తి కేంద్రాల నుంచి ఎర్ర సముద్రంలో టర్మినళ్లకు చమురు సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో హర్మూజ్ (Strait of Hormuz)ను బైపాస్ చేస్తోంది. సౌదీ అరేబియా వ్యాప్తంగా ఈస్ట్-వెస్ట్ క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ 1200 కి.మీ మేర విస్తరించింది. ఇది ప్రధాన చమురు ప్రాసెసింగ్ కేంద్రాలను ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్ట్ సిటీతో కలుపుతోంది.
దీనిద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు చమురు చేరుతోంది. అందుకే దీనిని పెట్రోలైన్‌గా పిలుస్తుంటారు. 1981లోనే ఈ కీలక పైప్‌లైన్‌కు పునాది పడింది. ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో సౌదీ మొదటి లైన్‌ను పూర్తిచేసింది. ఘర్షణ సమయంలో అంతరాయాలను ఎదుర్కొనేందుకు సముద్ర మార్గాలకు బదులుగా భూమార్గాలను సృష్టించుకోవాలనే లక్ష్యంతో ఈ లైన్‌ను దశలవారీగా విస్తరించుకుంటూ వస్తోంది. ఈ ఏడాది చివరికి ఈ లైన్.. రోజుకు 7 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా సామర్థ్యాన్ని చేరుకోగలదని అంచనా.