హార్మూజ్ జలసంధికి యుద్ధ నౌకలు పంపండి: ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్, అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలమార్గాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా , బ్రిటన్ వంటి ఏడు దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని జనాలు వణికిపోతున్నారు. మరోవైపు ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలమార్గాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా , బ్రిటన్ వంటి ఏడు దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
హర్మూజ్ జలసంధి రక్షణకు రావాలని ఈ ఏడు దేశాలను ట్రంప్ కోరారు. ఈ సముద్ర మార్గాన్ని భద్రంగా ఉంచేందుకు యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ వారిని కోరారు. త్వరలోనే అమెరికా నౌకాదళం చమురు ట్యాంకర్లకు రక్షణగా ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తుందని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పలు దేశాలు ఈ మార్గాన్ని తెరిచి ఉంచేందుకు సహకరించాలని కోరారు. ఇరాన్ చర్యల వల్ల ఈ దేశాల చమురు సరఫరా ప్రభావితమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ ఇప్పటికీ జలసంధిపై దాడి చేయగలదని ఆయన అంగీకరించారు.
ఇరాన్ ఎంత ఘోరంగా ఓడిపోయినా, ఈ జలమార్గంలో ఎక్కడో ఒకచోట ఒకటి లేదా రెండు డ్రోన్‌లను పంపడం, ఒక స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రయోగించడం వారికి సులభమని ట్రంప్ గుర్తు చేశారు. అయితే, ట్రంప్ విజ్ఞప్తికి ఇంకా ఏ దేశం స్పందించలేదు లేదా యుద్ధనౌకలను పంపలేదు. ఇరానియన్ దాడుల కారణంగా హార్ముజ్ జలసంధిలో సముద్ర రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. సాధారణంగా ఈ మార్గం ద్వారా ప్రపంచంలోని వివిధ దేశాలకు ముడి చమురు, సహజ వాయువు సరఫరా అవుతుంది. ఈ మార్గం వెడల్పు కేవలం 54 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.