గతంలో రవికుమార్ దొరికితే ఏం చేశారు?: భానుప్రకాష్ రెడ్డి
తిరుపతి (గాంధీరోడ్డు): తిరుమలను లక్ష్యంగా చేసుకుని వైకాపా నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తితిదే పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిలో ఉన్న జగన్.. ఏడుకొండలపైకి అనకొండలను పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని అనకొండలు వచ్చినా ఆదిశేషుడి ముందు తోక ఆడించలేరని మండిపడ్డారు. 11 నెలల క్రితం జరిగిన ఘటనను నిన్న జరిగినట్లుగా కరుణాకర్ రెడ్డి నానా రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
‘‘పరకామణిలో చోరీకి యత్నించినప్పుడు పెంచలయ్య అనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని మేం జైలుకు పంపాం. గతంలో రవికుమార్ దొరికితే మీరేం చేశారు? వాటాలు పంచుకుంది మీరు కాదా? విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ ద్వారా రవికుమార్ విజువల్స్‌ను మాయం చేసింది మీరు కాదా? శ్రీవారి హుండీలో కానుకలు పడకుండా వైకాపా కుట్ర చేస్తోంది’’ అని భానుప్రకాష్‌రెడ్డి అన్నారు.
తిరుమల శ్రీవారి పరకామణిలో భారీగా బంగారం చోరీ జరిగిందని మంగళవారం ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అసత్యమని తితిదే ఇప్పటికే తేల్చిచెప్పింది. వాస్తవాలను వక్రీకరించి రాశారని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది జనవరి 11న పరకామణిలో విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను అపహరించేందుకు యత్నించినప్పుడు తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ అప్రమత్తంగా వ్యవహరించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించినట్లు తెలిపింది. ఈ ఘటనను వక్రీకరించి పరకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగినట్లు, రూ.కోట్ల విలువైన బంగారం మాయమైనట్లు ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారమని ప్రకటనలో పేర్కొంది. (Andhra Pradesh News)