ఏపీలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ప్రోత్సహిస్తాం: మంత్రి నారా లోకేశ్
అమరావతి: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల వివరాలు, ఈఎంసీలో పరిశ్రమలకు ఇప్పటికే కేటాయించిన భూ విస్తీర్ణం, ఖాళీగా ఉన్న భూ విస్తీర్ణంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది కాబట్టే... ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని, ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోందన్నారు. ఇందులో భాగంగా విశాఖలో ఏసిప్ (ASIP)అనే సంస్థకు భూములు కేటాయించినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే.. యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.