Select Location
All Locations
State
Region
City / District
వెలుగు ఓపెన్ పేజీ : భారత అజేయ స్ఫూర్తి... సోమనాథ్

వెలుగు ఓపెన్ పేజీ : భారత అజేయ స్ఫూర్తి... సోమనాథ్

సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన నేపథ్యంలో ‘సోమనాథ్ స్వాభిమాన పర్వ్’ను పురస్కరించుకుని 2026 ప్రారంభంలో నేనక్కడికి వెళ్లాను. ఇప్పుడు మరోసారి సోమనాథ్‌‌ను దర్శించుకోబోతున్నాను. పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయాన్ని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించి 75 వసంతాలు నిండిన సందర్భంగా నేడు మే 11న ఆ పావన క్షేత్రానికి వెళ్తున్నాను. ఆరు నెలలలోపే సోమనాథ క్షేత్రానికి సంబంధించి రెండు మహత్తర ఘట్టాల్లో పాల్గొనడం, విధ్వంసం నుంచి సృజన దిశగా సోమనాథ్ మహోజ్వల ప్రస్థానంలో భాగస్వామినవడం నిజంగా నా అదృష్టం. నాగరికతకు సంబంధించి సోమనాథ్ మనకు ఒక సందేశాన్ని అందిస్తోంది. ఆలయం ముందున్న విశాల సముద్రం అమరత్వాన్ని ఆవిష్కరిస్తోంది. తుఫానులెంత భీకరంగా ఉన్నా, అలలు కల్లోలం చేసినా.. ఆత్మగౌరవంతో, శక్తితో పునరుత్తేజాన్ని పొందగలమని సముద్రుని అలలు మనకు చెబుతున్నాయి. ప్రజా చేతనను ఎంతోకాలం అణచిపెట్టలేమని ప్రతి తరానికీ ఈ సాగరం చెబుతున్నట్లుగా అలలు తిరిగి తీరాన్ని చేరుతున్నాయి.

మన ప్రాచీన గ్రంథాలిలా చెబుతున్నాయి - ‘ప్రభాసం చ పరిక్రమ్య పృథివీక్రమసంభవమ్’. అంటే దివ్యమైన ప్రభాస క్షేత్రం (సోమనాథ్)లో ఒకసారి ప్రదక్షిణ చేస్తే, ఈ భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే! ప్రార్థనల కోసం ఇక్కడికొచ్చే భక్తులు.. శాశ్వతమై, దేదీప్యమై వెలుగొందుతున్న ఈ అద్భుతమైన నాగరికతా ప్రవాహాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఎన్నో రాజ్యాలు వచ్చాయి. అంతరించిపోయాయి. కాలం మారింది. విజయాలు, వినాశనాల మధ్య నుంచి చరిత్ర సాగిపోయింది. అయినా సోమనాథ్ మన చేతనలో అచంచలంగా నిలిచే ఉంది. నిరంకుశత్వాన్ని ఎదిరించి దృఢంగా నిలిచిన మహనీయులనెందరినో స్మరించుకోవాల్సిన తరుణమిది. లకులిస, సోమశర్మ ఈ ప్రభాస క్షేత్రాన్ని గొప్ప తాత్విక కేంద్రంగా నిలిపారు. వల్లభి చక్రవర్తి మహారాజ నాలుగో ధారసేనుడు శతాబ్దాల కిందటే ఇక్కడ రెండో ఆలయాన్ని నిర్మించాడు. 

దండయాత్రలకు ఎదురొడ్డి మన నాగరికతా గౌరవాన్ని నిలబెట్టిన భీమదేవుడు, జయపాలుడు, ఆనందపాలుడు సదా స్మరణీయులు. భోజరాజు కూడా పునర్నిర్మాణానికి సాయం చేశాడని చెబుతారు. గుజరాత్ రాజకీయ, సాంస్కృతిక శక్తిని పునరుద్ధరించడంలో కర్ణదేవుడు, సిద్ధరాజ జయసింహుడు కీలక పాత్ర పోషించారు. భావ బృహస్పతి, కుమారపాల సోలంకి, పాశుపతాచార్యులు ఈ మందిరాన్ని పునర్నిర్మించి.. ఒక గొప్ప ఆరాధన, విద్యాకేంద్రంగా నిలిపారు. విశాలదేవ వాఘేలా, త్రిపురాంతకుడు ఇక్కడి ఆధ్యాత్మిక, మేధో పరంపరను రక్షించారు. ఆలయ విధ్వంసం తర్వాత తిరిగి పూజలు మొదలుపెట్టి మహీపాలదేవుడు, రా ఖంగార్ కీలకంగా నిలిచారు. ప్రస్తుతం 300వ జయంత్యుత్సవాలు జరుగుతున్న పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ అత్యంత క్లిష్ట సమయాల్లోనూ నిరంతరం ఆరాధన కొనసాగేలా చూసి, సోమనాథుని పట్ల భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.


V6 News 16 days ago
Home Flash News