Select Location
All Locations
State
Region
City / District
బెంగాల్‌ గడ్డపై బీజేపీ విజయానికి 5 కారణాలు.. మమతను దాటి కమలం ఎలా వికసించిందంటే?

బెంగాల్‌ గడ్డపై బీజేపీ విజయానికి 5 కారణాలు.. మమతను దాటి కమలం ఎలా వికసించిందంటే?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడ కమలం వికసించింది. దీంతో 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొడుతూ.. బీజేపీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ట్రెండ్స్ ప్రకారం 294 సీట్లకు గానూ బీజేపీ 186 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. టీఎంసీ కేవలం 93 సీట్లకే పరిమితమైంది. మమతా బెనర్జీ ప్రాబల్యాన్ని తగ్గించి, కాషాయ జెండా రెపరెపలాడటానికి దారితీసిన ఆ 5 కీలక అంశాలను విశ్లేషిస్తే..

టీఎంసీకి వెన్నుముకగా ఉన్న మహిళా ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యింది. సందేశ్‌ఖాలీ ఘటన, ఆర్‌.జీ కర్ ఆసుపత్రి ఉదంతాలను ప్రధానాస్త్రాలుగా చేసుకుని.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని బీజేపీ బలంగా ప్రచారం చేసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, బాధితులకు అండగా నిలిచిన రేఖా పాత్ర వంటి వారిని ఎన్నికల బరిలో నిలపడం నమ్మకాన్ని పెంచింది. నెలకు రూ.3వేలు ఆర్థిక సాయం హామీ కూడా మహిళా ఓటర్లను ఆకర్షించింది.

అమిత్ షా పర్యవేక్షణలో బీజేపీ ఈసారి పన్నా ప్రముఖ్, శక్తి కేంద్రాల ద్వారా గల్లీ రాజకీయాలను శాసించింది. గతంలో కేవలం పట్టణాలకే పరిమితమైన బీజేపీ.. ఈసారి మారుమూల గ్రామాల వరకు తన నెట్‌వర్క్‌ను విస్తరించింది. టీఎంసీకి బలంగా ఉన్న గ్రామీణ ఓటు బ్యాంకులో చీలిక తేవడానికి నిరంతర సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, స్థానిక కార్యకర్తలతో కనెక్ట్ అవ్వడం బీజేపీకి కలిసొచ్చింది.

15 ఏళ్ల సుదీర్ఘ పాలనలో టీఎంసీ ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం, పాలనాపరమైన విసుగును బీజేపీ సమర్థవంతంగా వాడుకుంది. టీఎంసీ నేతల అవినీతిని ఎండగడుతూ.. బంగారు బెంగాల్ నిర్మాణానికి మార్పు అవసరమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీ. శాంతిభద్రతల వైఫల్యం ఒక ఎమోషనల్ అంశంగా మారి.. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మార్చింది.

బెంగాల్ సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ చొరబాట్లను బీజేపీ ప్రధాన ఎజెండాగా మార్చింది. మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారని ప్రధాని మోడీ, అమిత్ షా పదేపదే విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే.. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానం ద్వారా అక్రమ వలసదారులను ఏరివేస్తామని ఇచ్చిన హామీ హిందూ ఓటర్లను ఏకం చేసింది.

బీజేపీని బయటి పార్టీగా చిత్రీకరించే టీఎంసీ వ్యూహానికి అమిత్ షా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తర్వాతి ముఖ్యమంత్రి బెంగాల్ గడ్డపై పుట్టిన వ్యక్తే ఉంటారని.. బెంగాలీ భాష, సంస్కృతి తెలిసిన నేతకే పట్టం కడతామని ప్రకటించి 'సన్ ఆఫ్ ది సాయిల్' కార్డును ప్లే చేశారు. శుభేందు అధికారి వంటి స్థానిక నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం, దుర్గామాత, కాళీమాత నామస్మరణతో హిందుత్వను బెంగాలీ అస్తిత్వంతో ముడిపెట్టడం బీజేపీ విజయానికి బాటలు వేసింది.


V6 News 1 hour ago
Home Flash News