Select Location
All Locations
State
Region
City / District
మిట్టల్‌ చేతికి రాజస్తాన్‌ రాయల్స్‌.. భారీ ట్విస్ట్‌!

మిట్టల్‌ చేతికి రాజస్తాన్‌ రాయల్స్‌.. భారీ ట్విస్ట్‌!

రాజస్తాన్‌ రాయల్స్‌ అమ్మకం విషయంలో భారీ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అమెరికా వ్యాపారవేత్త కాల్‌ సోమాని కన్సార్టియం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)తో చట్టపరమైన యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సంచలన ప్రకటన కాగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ అమ్మకానికి రాగా.. కాల్‌ సోమాని కన్సార్టియం దీనిని కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో ఆదివారం సంచలన ప్రకటన వచ్చింది. తాము ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసినట్లు మిట్టల్‌ కుటుంబం ప్రకటించింది. లక్ష్మీ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్, అదర్‌ పూనావాలాతో కలిసి 165 కోట్ల డాలర్ల (రూ. 15,660 కోట్లు) బిడ్‌తో రాయల్స్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీతో పాటు...

వేర్వేరు లీగ్‌ల్లో పార్ల్‌ రాయల్స్, బార్బడోస్‌ రాయల్స్‌ జట్లు కూడా మిట్టల్‌ సొంతం అయ్యాయి. అయితే, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్, బీసీసీఐ పాలక మండలి ఆమోదం అనంతరమే ఈ లావాదేవీ పూర్తి కానుంది. మరో మూడు నెలలు ఈ ప్రక్రియ ముగియడానికి మరో మూడు నెలలు పట్టొచ్చని సమాచారం. ‘మనోజ్‌ బదాలే కన్సార్టియం నుంచి అదర్‌ పూనావాలా భాగస్వామ్యంతో రాజస్తాన్‌ రాయల్స్‌ను కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది’ అని మిట్టల్‌ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వివరాల ప్రకారం రాయల్స్‌ జట్టులో మిట్టల్‌ కుటుంబం 75 శాతం వాటా కలిగి ఉంటుంది. పూనావాలా 18 శాతం వాటా కలిగి ఉంటారు. మిగిలిన 7 శాతం వాటాలో పాత యజమాని మనోజ్‌ బదాలేతో పాటు ఇతర పెట్టుబడిదారులు ఉంటారు.

దీంతో రాయల్స్‌ బోర్డులో లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్‌–భాటియా, అదర్‌ పూనావాలా, మనోజ్‌ బదాలే సభ్యులుగా ఉంటారు. ఇక రాజస్తాన్‌ సాదుల్‌పూర్‌లో జన్మించిన లక్ష్మీ మిట్టల్‌ మాట్లాడుతూ... ‘నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం రాజస్తాన్‌కు చెందింది. అందుకే వాటా కొనుగోలు చేసేందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ కంటే మంచి జట్టు లేదనిపించింది’ అని అన్నారు. లీగల్‌ లెటర్‌ పంపించబోతున్నాము ఈ నేపథ్యంలో కాల్‌ సోమాని సన్నిహిత వర్గాలు స్పందించాయి. క్రిక్‌బజ్‌ కథనం ప్రకారం.. సోమాని కన్సార్టియం ఈ అంశం మీద చట్టపరంగా ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘‘అమెరికాలోని మా లీగల్‌, PR (పబ్లిక్‌ రిలేషన్స్‌) టీమ్స్‌ ఈ విషయంపై కసరత్తు చేస్తున్నాయి. లీగల్‌ లెటర్‌ పంపించబోతున్నాము. 

సోమాని కన్సార్టియంలో వాల్టన్‌, హాంప్‌ వంటి ‍ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్లు డబ్బు ఇక్కడ అసలు సమస్యే కాదు. ఏం జరిగిందో తెలియదు. చర్చలు సజావుగానే సాగినా ఇలాంటి పరిణామం ఎదురైంది. ఈ విషయంలో మాకెన్నో సందేహాలు ఉన్నాయి. బీసీసీఐకి చెల్లింపులు నిజంగానే బకాయి పడ్డాయా?.. చట్టపరంగా మాకున్న అవకాశాలు ఏమిటి? అన్న విషయాలు పరిశీలిస్తున్నాం. మా మదిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కావాలనే చెల్లింపుల విషయంలో వాళ్లు (బోర్డు) ఆలస్యం చేశారనిపిస్తోంది. మేము సిద్ధంగా ఉన్న వాళ్ల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇప్పుడేమో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. మేము అంతర్గతంగా ఈ సమస్యని పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.


Sakshi 1 hour ago
Home Flash News