Select Location
All Locations
State
Region
City / District
Nadendla Bhaskara Rao Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత, మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పితృవియోగం

Nadendla Bhaskara Rao Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత, మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పితృవియోగం

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం పంజాగుట్ట శ్మశానవాటికలో భాస్కర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

1935 జూన్ 23న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన భాస్కరరావు, వృత్తిరీత్యా న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించి, ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించారు. నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికైన ఆయన, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1982లో నందమూరి తారక రామారావు (NTR) తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, ఆ పార్టీ ఏర్పాటులో భాస్కరరావు కీలక పాత్ర పోషించారని తెలిసిందే. ఎన్టీఆర్ తర్వాత పార్టీలో పవర్‌ఫుల్ లీడర్‌గా ఎదిగారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించాక, ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


ABP Nadu 1 hour ago
Home Flash News