ఆసియా నం 1 అదానీ.. సంపన్నుల జాబితాలో 92.6 బిలియన్ డాలర్లతో అగ్ర స్థానం
న్యూఢిల్లీ, ఏప్రిల్ : అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరోసారి దేశీయంగానేగాక, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పడిపోయారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా వివరాల ప్రకారం అదానీ సంపద విలువ 92.6 బిలియన్ డాలర్లుగా ఉన్నది. భారత్‌తోపాటు ఆసియా దేశాల్లోనే ఇది టాప్. ఇక ముకేశ్ అంబానీ సంపద విలువ 90.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది.ఇదే ముకేశ్ అంబానీని అధిగమించి మళ్లీ గౌతమ్ అదానీని అగ్రస్థానంలో నిలబెట్టింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో గౌతమ్ అదానీకి చెందిన 10 సంస్థలు ట్రేడ్ అవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తిదారుగా ఉన్న అదానీ గ్రూప్‌నకు భారీ ప్రైవేట్ సీపోర్ట్ నెట్‌వర్క్ సైతం ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక ఇన్‌ఫ్రా, రవాణా, మైనింగ్, డాటా సెంటర్లు, రక్షణ, ఏరోస్పేస్, రియల్టీ, సిమెంట్, మీడియా ఇలా అనేక రంగాల్లోనూ అదానీ కంపెనీలు విస్తరించాయి. అయితే ఇటీవలికాలంలో దాదాపు అన్ని కంపెనీల షేర్లకు మదుపర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతున్నది. ఫలితంగా ఆయా కంపెనీల మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగిపోయింది.
ఇదే ముకేశ్ అంబానీని అధిగమించి మళ్లీ గౌతమ్ అదానీని అగ్రస్థానంలో నిలబెట్టింది. మరోవైపు ఈ స్థాయిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ పుంజుకోలేకపోయింది. ఇక బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ప్రపంచ స్థాయిలో అదానీ 19, అంబానీ 20వ స్థానాల్లో ఉన్నారు. కాగా, రోజూ ప్రపంచంలోని టాప్-500 శ్రీమంతుల సంపద బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటుందన్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే శుక్రవారం అప్‌డేట్‌లో అంబానీని అదానీ దాటేసినట్టు తేలింది. 2022 ఫిబ్రవరిలో తొలిసారి అంబానీని వెనుకకు నెట్టి గౌతమ్ అదానీ సంపన్నుల జాబితాలో నంబర్ వన్ అయ్యారు. ఆ తర్వాత హిండెన్‌బర్గ్ దెబ్బకు మార్కెట్ వాల్యూ కరిగిపోయి పడిపోయారు.