వర్సిటీలకు పాలక మండళ్లు ఖరారు.. ఓయూ, అంబేద్కర్, శాతవాహన, తెలంగాణ, జేఎన్ టీయూకు ఈసీ సభ్యుల నియామకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులను సర్కారు నియమించింది. గత మూడేండ్లుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టులను భర్తీచేస్తూ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓయూ, జేఎన్టీయూహెచ్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, శాతవాహన, తెలంగాణ వర్సిటీలకు పాలక మండళ్లను ఖరారు చేస్తూ వేర్వేరుగా జీఓలు రిలీజ్ చేశారు. దీంతో ఆయా వర్సిటీల్లో కీలక నిర్ణయాలకు మార్గం సుగమమైంది. క్లాస్1 కేటగిరిలో ప్రతి వర్సిటీ ఈసీలో ముగ్గురు ఐఏఎస్లు (విద్యాశాఖ సెక్రటరీ, కాలేజీ/సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఫైనాన్స్ సెక్రటరీ) తో పాటు వర్సిటీ వీసీ, రిజిస్ర్టార్ ఉంటారు.
జేఎన్టీయూకు మాత్రం వీరితో పాటు వర్సిటీ రెక్టార్ కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు క్లాస్ 2 కేటగిరీలో వివిధ కాలేజీలు, సంస్థల నుంచి పలువురిని తాజాగా ప్రభుత్వం సభ్యులుగా నియమించింది. దీనిలో సీనియర్ ప్రొఫెసర్లతో పాటు ప్రైవేట్ అనుబంధ కాలేజీ నుంచి ఒకరు, వివిధ రంగాల్లోని నిపుణులను సభ్యులు నియమిస్తారు. కానీ వర్సిటీలను కోఆర్డినేట్ చేసే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రతినిధులకు ఈసారి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించలేదు.