రోజుకు రూ.16 వందల కోట్ల నష్టం.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పేలా లేదుగా..!
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అయితే.. మన దేశంలో ఇంధన ధరలపై ఆ ప్రభావం ఇప్పటికైతే పడలేదు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతారని ప్రచారం జరిగినా ప్రస్తుతానికి వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట ఇచ్చింది. అయితే.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. యుద్ధం కారణంగా.. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని ఇప్పటికే జాతీయ మీడియా కోడై కూస్తోంది.
ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల వల్ల మార్చిలో బ్యారెల్ చమురు ధర 120 డాలర్లకు చేరింది. ఈ ప్రభావం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలపై తీవ్రంగా పడిందని.. రోజుకు రూ.16 వందల కోట్ల నష్టం చవిచూస్తున్నాయని OMC వర్గాలు చెబుతున్నాయి. ఒకానొక దశలో ముడి చమురు ధరలు తీవ్రంగా పెరిగినప్పుడు.. రోజువారీ నష్టాలు రూ. 2 వేల 400 కోట్లకు చేరాయని.. ఆ తర్వాత అవి తగ్గి ప్రస్తుతం రోజుకు రూ. 1,600 కోట్ల నష్టాన్ని ఓఎంసీలు భరిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.