24 మంది డిప్యూటీ సీఈఓలకు ప్రమోషన్లు..సీఈఓలుగా పదోన్నతి కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల సందడి నెలకొంది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు (డిప్యూటీ సీఈఓ) ప్రభుత్వం తీపి కబురు అందించింది. 24 మంది డిప్యూటీ సీఈఓలను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా (సీఈఓ) అడ్ హాక్ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన అధికారులను జిల్లా ప్రజా పరిషత్‌లు, డీఆర్‌డీఏలు, ఇతర విభాగాల్లో కీలక పోస్టింగుల్లో నియమించారు.
మరికొందరు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ములుగు డీఆర్‌డీఓగా డిప్యుటేషన్ పై ఉన్న ఎం. శ్రీనివాసరావును హనుమకొండ జిల్లా డిప్యూటీ సీఈఓగా బదిలీ చేశారు. జనగామ జడ్పీపీ సీఈఓగా ఉన్న మాధురి కిరణ్ చంద్రషాను హైదరాబాద్‌లోని టీజీఎస్ఈఆర్పీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు, బదిలీలు పొందిన అధికారులు వెంటనే పాత స్థానాల నుంచి రిలీవ్ అయి కొత్తచోట బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.