క్యూర్ పరిధిలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు.. మంజూరు చేయాలని కలెక్టర్లకు సర్కార్ ఆదేశం
హైదరాబాద్,వెలుగు: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇండ్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొంత జాగలు ఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో క్యూర్ పరిధిలో మారు 30 వేల మందికి సొంత స్థలాలు ఉన్నట్లు ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా గుర్తించారు. వీరి అర్హతను నిర్ధారించేందుకు రీ సర్వే చేపట్టాలని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్జిల్లా ఇన్‌చార్జి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నాలుగు జిల్లాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. రంగారెడ్డిలో 12 వేల అప్లికేషన్లకు 42 టీంలు, మేడ్చల్‌లో 11 వేల దరఖాస్తులకు 25 టీంలు, హైదరాబాద్‌లో 6 వేల దరఖాస్తులకు 26 టీంలు, సంగారెడ్డిలో 1,100 అప్లికేషన్లకు 18 టీంలతో రీ సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 12 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, అందులో 5 వేల మంది అర్హులుగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. వీరికి త్వరలోనే కలెక్టర్లు మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
గ్రేటర్‌లో తొలిసారి వేగం..
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
ఇప్పటివరకు 3.25 లక్షల ఇళ్లు మంజూరు కాగా, అందులో 2.66 లక్షల ఇళ్లు ప్రారంభమయ్యాయి. దాదాపు 20 వేల ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారులకు ఇప్పటివరకు వివిధ దశల్లో రూ.6 వేల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 13 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ, సొంత జాగా ఉన్న వారు లక్ష మందికి తక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం అవాస్ యోజన కింద తెలంగాణకు 1.13 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. అర్బన్ ఏరియాల్లో దరఖాస్తులను పరిశీలిస్తూ ఇప్పటివరకు సుమారు 15 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.