సీఈసీపై చర్యలకు రాజ్యాంగ ప్రమాణాలు లేవు : రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు సమర్పించిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ సి. పి. రాధాకృష్ణన్ తిరస్కరించారు. ఆరోపణలు రాజకీయ చర్చల పరిధిలోకే వస్తాయని, సీఈసీపై తొలగింపు చర్యలు తీసుకునేంత రాజ్యాంగ ప్రమాణాలను అవి తీరవని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు దాఖలు చేసిన నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా సోమవారం తిరస్కరించారు. సీఈసీపై దుష్ప్రవర్తనను నిర్ధారించే స్థాయి ఆధారాలు నోటీసులో లేవని రాధాకృష్ణన్ తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5), 124(4) ప్రకారం అవసరమైన ప్రాథమిక ఆధారాలు చూపలేదన్నారు.
అందువల్ల జడ్జెస్ (ఎంక్వైరీ) యాక్ట్, 1968 కింద మోషన్‌ను స్వీకరించేందుకు షరతులు నెరవేరలేదని పేర్కొన్నారు. జ్ఞానేష్ కుమార్ నియామక ప్రక్రియపై సుప్రీం కోర్టులో పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, అదే ఆధారంగా దుష్ప్రవర్తన ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఈ నోటీసులపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, వామపక్షాలు సంతకాలు చేయగా ఆమ్ఆద్మీ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ పార్లమెంటులో నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.