ప్రాణం పెట్టి పనిచేసినా పీకేశారు.. జాబ్ పోయాక జ్ఞానోదయం అయ్యింది: గూగుల్ మాజీ ఉద్యోగి
అమెరికా చెందిన టెక్ దిగ్గజం గూగుల్‌లో ఏళ్ల తరబడి పనిచేసిన మాజీ ఉద్యోగి జేసన్ జాంగ్ చేసిన కామెంట్స్ కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. తాను కంపెనీ కోసం పర్సనల్ లైఫ్, టూర్స్ పక్కనపెట్టి రాత్రింబగళ్లు శ్రమించినప్పటికీ.. చివరకు లేఆఫ్స్ సమయంలో తొలగించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తే ఉద్యోగ భద్రత ఉంటుందనేది కేవలం భ్రమ మాత్రమేనని.. కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైనా ఎవరినైనా పీకేయటం సర్వసాధారణంగా అయిపోయిందని ఇన్స్టాగ్రామ్ పోస్టులో హెచ్చరించారు.
కంపెనీ కోసం తాను చేసిన త్యాగాలు ఏవీ చివరికి పనికిరాలేదని జేసన్ జాంగ్ పేర్కొన్నారు. తాను ఎప్పుడూ జీవితంలో పనికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు గూగుల్ మాజీ టెక్కీ. ఎక్కువ గంటలు శ్రమిస్తే, సెలవులను వాయిదా వేసుకుంటే దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని భావించాను. కానీ ఎంత టాలెంట్ ఉన్నవాడినైనా కంపెనీలు ఎప్పుడైనా తొలగించవచ్చని ప్రత్యక్షంగా చూశాక తన ఆలోచన మారిపోయిందని పోస్టులో పేర్కొన్నాడు. ఉద్యోగం పోయిన తర్వాతే తనకు జ్ఞానోదయం అయిందని, ఇతరుల కోసం కాకుండా తన కోసం తాను ఏదైనా బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు టెక్కీ.
జేసన్ జాంగ్ అనుభవం కేవలం ఆయనది మాత్రమే కాదు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టెక్కీలు ఎదుర్కొంటున్న చేదు నిజం. పని ఒత్తిడి, పర్సనల్ లైఫ్‌కి మధ్య హద్దులు చెరిగిపోవడం వల్ల అనేకమంది మానసిక ఒత్తిడికి, అలసటకు లోనవుతున్నారు. కంపెనీ కోసం ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే మానసిక వేదన వర్ణనాతీతం. ఈ పోస్టుపై స్పందించిన ఒక నెటిజన్ మనం ఇతరుల కోసం కష్టపడటం నేర్చుకున్నాం కానీ.. మన గురించి మనం ఆలోచించడం మర్చిపోతున్నాం అన్నారు.