తిరుపతిలో పెరగనున్న డివిజన్లు
జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరగనుంది.
తిరుపతి సిటీ: జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లు 66కు పెరగనుండగా భవిష్యత్తులో గ్రేటర్‌గా విస్తరించినట్లైతే 76కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి(Tirupati) నగరం వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రస్తుత వార్డుల పరిమితులు మారనున్నాయి. 4 లక్షల జనాభా ఉంటే 66 వార్డులకు విస్తరించాలని తాజా ఉత్తర్వులు చెబుతున్నాయి. వాస్తవానికి తిరుపతి జనాభా అంచనా 4.52 లక్షలు.
దీంతో ప్రస్తుతమున్న 50 డివిజన్లకు మరో 16 వార్డులు అదనంగా కలవనున్నాయి. జనాభా పెరుగుదలతో పాటు కొత్త కాలనీలు విలీనం చేసిన కారణంగా ప్రజలకు సేవలు అందించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న పునర్విభజన నిర్ణయం నగరపాలనను మరింత సమర్థవంతం చేయనుంది. చిన్న డివిజన్ల రూపకల్పనతో ప్రతి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం కలుగుతుంది. భవిష్యత్తులో తిరుపతిని గ్రేటర్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేసే దిశగా కూడా ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. 7.86 లక్షల జనాభాతో 65 గ్రామాలను విలీనం చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇటీవల పంపిన విషయం తెలిసిందే.
6 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉంటే 76 వార్డులుండాలని ప్రభుత్వ డీలిమిటేషన్ ఉత్తర్వు చెబుతోంది. దీంతో తిరుపతి గ్రేటర్‌తో ఎన్నికలు జరిగితే 76 డివిజన్లు ఉంటాయి.జనాభా ఆధారంగా వార్డుల సంఖ్య పెంచే ప్రతిపాదనతో నేతల్లో లెక్కలు మొదలయ్యాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. కొత్త వార్డుల ఏర్పాటుతో కొత్త నాయకులకు అవకాశం లభించనుండగా ప్రస్తుత కార్పొరేటర్లలో తమ వార్డుల మార్పులపై కొంత ఆందోళన కనిపిస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి జనాభా నిష్పత్తి ప్రకారం సమతుల్యంగా వార్డులను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.