డ్రోన్ల కలకలం.. మళ్లీ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో అంతరాయం
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్‌లోని తమ వెబ్ సర్వీసెస్ (Amazon Web Services)లో అంతరాయం ఏర్పడినట్లు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పేర్కొంది. ఆ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ ఘటన కారణంగా ఎంత నష్టం వాటిల్లింది, ఎన్ని రోజులపాటు అంతరాయం కొనసాగనుందనే వివరాలను అమెజాన్ వెల్లడించలేదు. దీనినుంచి బయటపడేవరకు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతాల్లోని వెబ్ సర్వీసెస్‌లకు మార్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో.. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు ఇతర ప్రదేశాలకు తరలివెళ్లాలని తమ ఉద్యోగులకు ఇప్పటికే సూచించినట్లు పేర్కొంది. కాగా.. ఈనెల ప్రారంభంలో బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తమ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు నాడు అమెజాన్ పేర్కొంది.