నా రంగు చూసి అవకాశాలు ఇవ్వలేదు.. వెటరన్ కామెంటేటర్ శివరామకృష్ణన్ రిటైర్మెంట్
బీసీసీఐ వ్యాఖ్యాతగా తన సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలుకుతున్నట్లు భారత మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన ప్రకటన చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం రిటైర్మెంట్ ప్రకటించడమే కాకుండా, తనపై వివక్ష చూపించారంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శివరామకృష్ణన్ తన ఆవేదనను వెళ్లగక్కారు. 23 ఏళ్లుగా కామెంటరీ బాక్స్‌లో ఉన్నా, తనకు సరైన అవకాశాలు ఇవ్వలేదన్నారు.
అయితే, రవిశాస్త్రి టీమ్ ఇండియా కోచ్‌గా ఉన్న సమయంలో కూడా తనకు టాస్ వేయించే అవకాశం లేదా ప్రజెంటేషన్ సెర్మనీలు నిర్వహించే అవకాశం ఇవ్వలేదని వెటరన్ కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆరోపించారు. బీసీసీఐ ప్యానెల్ లోకి కొత్తగా వచ్చిన వారికి ఇస్తున్న ప్రాధాన్యత తనకు ఎందుకు ఇవ్వడం లేదని ఒక యూజర్ ప్రశ్నించగా.. తాను నలుపు రంగులో ఉండటం వల్లే ఇలా జరుగుతోందని సంచలన సమాధానం ఇచ్చారు. ఈ రిటైర్మెంట్ కేవలం ఈ కథకు ఆరంభం మాత్రమే.. నేను నిజాలు చెబితే క్రికెట్ అభిమానులు, సామాన్య ప్రజలు షాక్‌కు గురవుతారు.. బీసీసీఐ కూడా నమ్మలేనన్ని నిజాలు బయటపెడతాను అని హెచ్చరించారు. నన్ను ద్వేషించే వాళ్లు ఈ రిటైర్మెంట్ వార్తతో సంతోషపడతారు, కానీ తనకు గౌరవం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని శివరామకృష్ణన్ వెల్లడించారు.