టీ20 ప్రపంచకప్ 2026 విజేతను సత్కరించిన సీఎం రేవంత్
టీ20 ప్రపంచకప్ 2026 విజేత జట్టులో సభ్యుడైన హైదరాబాద్ స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. వరల్డ్ కప్ 2026 విజయానంతరం హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ.. సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ ఐసీసీ టోర్నీ అనంతరం వారి వారి స్వస్థలాలకు చేరుకున్న భారత క్రికెట్ జట్టు సభ్యులకు సత్కారాలు, అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రపంచ కప్ 2026 విజేత జట్టులో సభ్యుడైన హైదరాబాద్ స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. వరల్డ్ కప్ 2026 విజయానంతరం స్వస్థలానికి చేరుకున్న తిలక్.. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా తిలక్‌ను సీఎం రేవంత్ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. అంతకముందు ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తిలక్ వర్మకు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధికారులతో పాటు శాప్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, అభిమానులు తిలక్ వర్మకు స్వాగతం పలికారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు తిలక్ పేరుతో మార్మోగింది.