South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ట్రంప్‌ విధానాలపై జేడీ వాన్స్‌ విమర్శలు.. 2028 గేమ్‌ప్లాన్‌లో భాగమేనా?

ట్రంప్‌ విధానాలపై జేడీ వాన్స్‌ విమర్శలు.. 2028 గేమ్‌ప్లాన్‌లో భాగమేనా?

JD Vance on Election | ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US midterm Elections) రిపబ్లికన్ పార్టీ పరాజయం పాలై సెనెట్‌, ప్రతినిధుల సభ రెండింటినీ డెమోక్రాట్లు కైవసం చేసుకోవడంతో వైట్‌హౌస్‌లో లుకలుకలు బయటపడ్డాయి. ఎన్నికల్లో ఓటమికి ట్రంప్‌ విధానాలే కారణమంటూ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న నిరాశావాదంతో కాకుండా.. వ్యూహాత్మకంగానే వాన్స్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న జేడీ వాన్స్.. ట్రంప్ విధానాల నుంచి తనను తాను వేరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జేడీ వాన్స్‌ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. ఇరాన్‌తో యుద్ధం చేయడం వల్లే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని అందులో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం వల్ల తాము ఓడిపోలేదని, 2024 అధ్యక్ష ఎన్నికల్లో తమకు ఓటు వేసిన చాలా మంది ఓటర్లు.. ఈసారి కోపంతో డెమోక్రాట్లకు ఓటు వేశారంటూ ఓ సర్వే నివేదికను ఉటంకించారు. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, ఇజ్రాయెల్‌తో అమెరికాకు ఉన్న దౌత్యపరమైన బంధంపై ఓటర్లలో ఉన్న తీవ్ర అసంతృప్తి తమ పార్టీని దెబ్బతీశాయని తెలిపారు. సెనెట్‌ను కోల్పోయినా యుద్ధం చేయడం సరైందే అని ఎవరైనా వాదిస్తే వాదించుకోవచ్చంటూ ట్రంప్‌పై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

బ్రో.. జ్ఞానేశ్‌ను మాకు ఇవ్వవా!
రిపబ్లికన్‌ పార్టీ ఓటమికి ఇజ్రాయెల్‌ కూడా ఓ కారణమని జేడీ వాన్స్‌ అభిప్రాయపడ్డారు. ఇరాన్‌ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పిన ప్రతి ఒక్కటీ తప్పేనని వాన్స్ ప్రైవేట్ సంభాషణల్లో అన్నట్లు యాక్సియోస్ కథనం వెల్లడించింది. వాషింగ్టన్ తన విదేశాంగ విధానాన్ని ఇజ్రాయెల్‌కు తాకట్టు పెట్టకూడదన్నారు. అంతులేని విదేశీ యుద్ధాల్లో అమెరికా తలదూర్చడం సరికాదని వాన్స్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికలకు ముందు ట్రంప్‌ కూడా యుద్ధాల్లో తలదూర్చడం సమంజసం కాదని పేర్కొనడం గమనార్హం.

ట్రంప్‌ విధానాలకు దూరం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున ఇప్పటికే రెండుసార్లు ట్రంప్‌ ఎన్నికయ్యారు. అమెరికాలో రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా పోటీ చేయకూడదన్న నిబంధన ఉంది. దీంతో 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు అవకాశాలు మూసుకుపోయినట్లే. దీంతో ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న వాన్స్‌.. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రంప్‌ వైఖరిని వ్యతిరేకిస్తూనే.. అమెరికన్‌ ఓటర్లను, కోపంతో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులను ఆకర్షించడానికి తనదైన ప్రణాళికను ప్రకటించారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించడం; జీవన వ్యయం, ద్రవ్యోల్బణం తగ్గించడంపై దృష్టి పెట్టడం; అమెరికాకే తొలి ప్రాధాన్యం, ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలు మార్చుకోవడం వంటివి తన పోస్ట్‌లో ప్రస్తావించారు. తద్వారా అధ్యక్ష హోదాలో ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల నుంచి తాను దూరం జరగడంతో పాటు కోర్‌ రిపబ్లికన్‌ ఓటర్లను తిరిగి ఆకట్టుకోవడమే లక్ష్యంగా వాన్స్‌ పావులు కదుపుతున్నారని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.

📍 Guntur
📰 Eenadu Telugu
🕒 16 days ago

Related News

మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
ఇటలీ నాయకుడి ‘ఓట్‌ చోర్‌’ కామెంట్స్‌.. రాహుల్‌పై మండిపడ్డ భాజపా
ఇటలీ నాయకుడి ‘ఓట్‌ చోర్‌’ కామెంట్స్‌.. రాహుల్‌పై మండిపడ్డ భాజపా
⬅ Back
➕ Post Ad
To Ads ➡