జడల్ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకూ తెలుగు సినిమాలో రాలే.. నా కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ యాక్షన్ మూవీ ప్యారడైజ్: నాని
జడల్ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకూ తెలుగు సినిమాలో రాలేదని, ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని మదర్ సన్ ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని నాని అన్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామా సెప్టెంబర్ 24న వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నాని ఇలా ముచ్చటించాడు.
ఇది ఒక ప్రదేశం చుట్టూ జరిగే కథ. ‘ప్యారడైజ్’ అనే ప్రాంతంలో సవారీ అనే తెగకు చెందిన ప్రజలకు ఎలాంటి గుర్తింపు ఉండదు. వారి ఉనికిని కూడా సమాజం పట్టించుకోదు. అలాంటి పరిస్థితుల్లో తమకు గుర్తింపు కోసం వారు చేసే తిరుగుబాటు చుట్టూ కథ సాగుతుంది. 1984–-85 కాలానికి సంబంధించిన నేపథ్యంలో కథ సాగుతుంది.
‘ది ప్యారడైజ్’లో నేను పోషించిన జడల్ పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కథలో నుంచే వచ్చిన ఈ లుక్ తెలుగు సినిమాలో చాలా కొత్తగా అనిపిస్తుంది. జడలతో కనిపించే లుక్ వెనుక కథలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.
అలాగే సవారీల బొట్టు, ముక్కుపుడక, చైను వంటి ప్రతి అంశానికీ కథలో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ లుక్ కోసం మేకప్‌కు దాదాపు గంటా నలభై నిమిషాల సమయం పట్టేది. సినిమాలో భారీగా రోప్ వర్క్ ఉండటంతో యాక్షన్ సమయంలో జడలు రోప్‌కు చుట్టుకోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. నా కష్టం చూసి ఫైట్ మాస్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.
ఈ సినిమాలో ప్రతి యాక్షన్ వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రతి దెబ్బ వెనుక ఒక కారణం ఉంటుంది. నా కెరీర్‌లో అత్యంత కష్టపడి చేసిన సినిమా ఇది. భవిష్యత్తులో మరిన్ని యాక్షన్ సినిమాలు చేసినా, ఈ సినిమా కోసం పడినంత కష్టం మాత్రం పడకపోవచ్చు (నవ్వుతూ). ఇందులో బలమైన మదర్ అండ్ -సన్ ఎమోషన్ కూడా ఉంది. ప్రేక్షకుల మనసులో అది బలంగా నిలిచిపోతుంది. సినిమా చూసిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ‘ది ప్యారడైజ్’ ప్రభావం ప్రేక్షకులపై ఉంటుంది.