మమత పార్టీ సింబల్ చేంజ్.. టీఎంసీ పేరు, సింబల్ ఎవరూ వాడొద్దని ఈసీ ఆదేశం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇటీవల రెండుగా చీలిపోవడం, తమదే అసలైన పార్టీ అని ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తున్న వేళ ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. నందిగ్రామ్, రెజినాగర్ స్థానాలకు అక్టోబర్ 6 న జరగనున్న ఉపఎన్నికల్లో టీఎంసీ పార్టీ పేరును, దాని ఎన్నికల సింబల్ ‘‘జోర్ పూలు(గడ్డి పూలు)’’ని రెండు గ్రూపులూ ఉపయోగించరాదని స్పష్టం చేసింది. రెండు గ్రూపులు మూడు పేర్లు, మూడు ఫ్రీ సింబల్స్ చొప్పున సమర్పించాలని గురువారం రాత్రి ఆదేశించింది.
ఈ క్రమంలో ఆయా వర్గాలు సమర్పించిన విష్‌లిస్ట్ ఆధారంగా ఎన్నికల సంఘం.. రెండు వర్గాలకు కొత్త పేర్లను, గుర్తులను శుక్రవారం కేటాయించింది. మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గానికి 'మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్' అనే పేరును, అలాగే 'ఫుట్‌బాల్ ఆటగాడు' సింబల్ ఇచ్చింది. అలాగే, రితబ్రత బెనర్జీ, అరూప్ రాయ్ నేతృత్వంలోని రెబల్స్ గ్రూపునకు 'డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్' అనే పేరును, 'ఎన్వలప్' గుర్తును కేటాయించింది. కేవలం ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈ మధ్యంతర ఏర్పాట్లు చేశామని.. వివాదంపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఇది అమలులో ఉంటుందని ఈసీ పేర్కొంది.